బిజెపి కేంద్ర మంత్రులు తెలంగాణాలో తిట్టి..ఢిల్లీ లో అవార్డ్స్ ఇస్తారు – సీఎం కెసిఆర్

బిజెపి కేంద్ర మంత్రులు తెలంగాణ లో అడుగుపెట్టి ఇక్కడి ప్రభుత్వాన్ని , టిఆర్ఎస్ నేతలు తిట్టి..ఢిల్లీ లో తెలంగాణ కు అవార్డ్స్ ఇస్తుంటారని అన్నారు సీఎం కేసీఆర్. శనివారం వరంగల్ లో కేసీఆర్ పర్యటించారు. ప్రతిమ క్యాన్సర్ హాస్పటల్ ను ప్రారంభించి..అనంతరం సభలో ప్రసంగించారు.

ఈ దేశం చాలా గొప్ప దేశం. స‌హ‌న‌శీల‌త దేశం. అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో త్యాగాల‌కు సిద్ధ‌ప‌డే దేశం. పోరాటాల‌తో ముందుకు పోయే దేశం. అంద‌ర్నీ క‌లుపుకుపోయేటటువంటి అద్భుతమైన దేశం. పూల‌బోకే లాంటి గొప్ప దేశం. ప్రేమ‌తో బ‌తికేట‌టువంటి ఈ దేశంలో కొద్ది మంది దుర్మార్గులు.. వాళ్ల స్వార్థ‌, నీచ ప్ర‌యోజ‌నాల కోసం విష‌బీజాలు నాటే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అది ఏ ర‌కంగా కూడా స‌మ‌ర్థ‌నీయం కాదు.. ఏ ర‌కంగా కూడా స‌మాజానికి మంచిది కాదన్నారు.

తెలంగాణ ప్రజల అండదండలతో కొనసాగిన ఉద్యమం.. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనేక రంగాల్లో నేడు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని.. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు. వరంగల్‌లో ప్రతిమ క్యాన్సర్‌ ఆస్పత్రిని 350 పడకల సామర్థ్యంతో నిర్మించారని.. ప్రతిమ వైద్య కళాశాలలో 150 మెడికల్‌ ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ప్రజలకు ఏ విషయం అయితే పదేపదే చెప్పానో.. అది వందకు వంద శాతం ఇవాళ సాకారం అవుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ధనిక రాష్ట్రంగా ఉంటామని ఉద్యమ సమయంలో తాను చెప్పానని గుర్తు చేశారు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి కేసీఆర్‌ను.. ఇక్కడి మంత్రులను తిట్టి వెళ్తారు.. అలా తిట్టిన వారే ఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు తమను విమర్శిస్తున్నారని స్పష్టం చేశారు.