బిజెపి ఆగడాలు పోవాలంటే.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి – ఎంపీ కవిత

బిజెపి ఆగడాలు పోవాలంటే.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అన్నారు మహబూబాబాద్ ఎంపీ కవిత. దేశ ప్రజలంతా కేసీఆర్ జాతీయ ఎంట్రీ కోసం చూస్తున్నారని..కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో రాష్ట్రాలను భయభ్రాంతులకు గురిచేస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేసారు.

అలాగే ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సైతం కేసీఆర్ జాతీయ పార్టీ ఫై స్పందించారు. దేశంలో బిజెపిని బొంద పెట్టాలని మండిపడ్డారు. భారతదేశానికి మరోసారి స్వాతంత్ర్యం అందించాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నారని అన్నారు. బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఈ దేశానికి కెసిఆర్ ఒక్కరే శరణ్యం అన్నారు. బిజెపి రాష్ట్రాల హక్కులను హరిస్తోందని, అందుకే కెసిఆర్ కొత్త పార్టీ పెట్టాలని అందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. కెసిఆర్ మాట్లాడే ప్రతి మాటను దేశ ప్రజలు నమ్ముతున్నారని చెప్పుకొచ్చారు.

కొంత కాలంగా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ పైన ప్రజాభిప్రాయం తెలుసుకొనే ప్రయత్నం చేసిన సీఎం..ఇప్పుడు రంగంలోకి దిగేందుకు నిర్ణయించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించటమే లక్ష్యంగా పని చేస్తామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ముందుగా పార్టీ ప్రకటన చేయాలని..ఆ తరువాతనే జాతీయ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నారు. ముందకొచ్చిన పార్టీల నేతలతో కలిసి పొత్తులు – ఫ్రంట్ పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 11వ తేదీన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి హైదరాబాద్ రానున్నారు. గతంలో బెంగళూరు వెళ్లిన కేసీఆర్ మాజీ ప్రధాని దేవగౌడ..కుమార స్వామితోనూ కేసీఆర్ సమావేశం నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న నేతలను కలుపుకొని ప్రత్యామ్నాయంగా మారాలనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.