ఈరోజు కూడా మీడియా ముందుకు కేసీఆర్..బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తారా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పటు చేసి దాదాపు మూడు గంటల పాటు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కేంద్రం ఫై అలాగే బిజెపి మంత్రులపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. అయితే సీఎం కేసీఆర్ చేసిన ఆ వ్యాఖ్యలకు.. ఇవ్వాళ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చేశారు.

సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ తప్పేనని తేల్చేశారు. వరి కొంటామని అగస్టు 31వ తేదీనే కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని… కానీ, లేఖ రాయలేదని కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒకసారి వరి వేయాలని, మరొకసారి వేయవద్దని చెపుతూ రైతులను తికమకపెడుతున్నారని దుయ్యబట్టారు.

రైతు చట్టాల విషయంలో కూడా కేసీఆర్ పూటకో మాట మాట్లాడారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి ఎక్కడ పండుతోందో కేసీఆర్ చూపించాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై పెద్ద స్కాం చేశారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఢిల్లీకి వెళ్తే కేసీఆర్ ను ఎవరూ పట్టించుకోరని అన్నారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచలేదని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమని వ్యాఖ్యానించారు. లీటర్ పై కేంద్రానికి రూ. 27 వస్తే రాష్ట్రానికి రూ. 28 వస్తోందని అన్నారు. కేంద్రానికి వెళ్లే రూ. 27లో రాష్ట్రానికి మళ్లీ రూ. 12 తిరిగి వస్తాయని చెప్పారు.

తన మెడ నరుకుతాననని కేసీఆర్ అన్నారని… ఎప్పుడు నరుకుతారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగానే ఇవాళ సాయంత్రం 4 గంటలకు మరోసారి మీడియా ముందుకు రాబోతున్న కేసీఆర్. మరి కేసీఆర్ ఈ మీడియా సమావేశం లో ఏం మాట్లాడతారో చూడాలి.