పూజ సామగ్రిని త్రివేణి సంగమంలో కలిపేందుకే కాళేశ్వరానికి వెళ్లారు

ఉద్యమ ద్రోహులే కెటిఆర్ సిఎం కావాలని కోరుకుంటున్నారు ..బండి

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ తన కుమారుడు కెటిఆర్‌ని సిఎం చేయడానికి తన ఫాంహౌస్ లో మూడు రోజుల పాటు దోష నివారణ పూజలు నిర్వహించారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉపయోగించిన పూజ సామగ్రిని త్రివేణి సంగమంలో కలిపేందుకే కుటుంబ సమేతంగా కెసిఆర్ కాళేశ్వరానికి వెళ్లారని అన్నారు. కాళేశ్వరంలో కెసిఆర్ దంపతులు ఏం కలిపారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మూడో టీఎంసీ అంటూ ప్రజలను కెసిఆర్ మభ్యపెడుతున్నారని… మూడో టీఎంసీతో వచ్చే లాభమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమ ద్రోహులు మాత్రమే కెటిఆర్‌ సిఎం కావాలని కోరుకుంటున్నారని… కెటిఆర్‌ సిఎం కావడం నిజమైన ఉద్యమకారులకు ఇష్టం లేదని సంజయ్ అన్నారు. మంత్రి ఈటలకు టిఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పారు. ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఈటలను ముందు పెట్టి కేసీఆర్ బయటపడుతున్నారని దుయ్యబట్టారు.

కెటిఆర్ సిఎం అయినా, కాకపోయినా తమకు ఒకటేనని సంజయ్ చెప్పారు. కెటిఆర్ సిఎం కావడాన్ని ఇష్టపడని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వస్తే బీజేపీలో చేర్చుకుంటామని… అయితే వారికి అవినీతి మరకలు ఉండకూడదని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కెసిఆర్ చెప్పారని… ఇప్పటికైనా ఆ పని చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. కెసిఆర్ చేసే పూజలన్నీ ఆయన కుటుంబ బాగుకోసమేనని… తాము చేసే పూజలు సమాజ హితం కోసమని అన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/