ఈ నెల 10న ఎమ్మెల్యేలతో సమావేశం

kcr, ts cm
kcr, ts cm


హైదరాబాద్‌: శాసనసభ్యుల కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల వ్యూహంపై ఈ నెల 10న తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయాలని సియం కేసిఆర్‌ నిర్ణయించారు. అప్పటి వరకు ఉన్న బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటింగుపై చర్చిస్తారు. 11న తెలంగాణ భవన్‌లోనే నమూనా పోలింగ్‌ నిర్వహించి ఎన్ని స్థానాలు కైవసం చేసుకోగలమో సమీక్షించుకుంటారు. ఈ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో టిఆర్‌ఎస్‌, ఒక స్థానంలో మజ్లిస్‌ కలిసి బరిలో నిలిచాయి. కాంగ్రెస్‌ పార్టి కూడా ఒక స్థానం కోసం పోటీ పడుతుంది. మొత్తం ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఈ రోజే నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. కాంగ్రెస్‌ పోటీలో పాల్గొంటే ఈ నెల 12న ఎన్నికలు జరుగుతాయి. టిఆర్‌ఎస్‌ ప్రస్తుత బలం 91, మజ్లిస్‌ 7 కాని ఈ మధ్య టిఆర్‌ఎస్‌లోకి వచ్చిన వలస ఎమ్మెల్యేలతో కలిపి టిఆర్‌ఎస్‌ బలం 101కి చేరింది. మొత్తం ఐదుగురు సభ్యులు ప్రథమ ప్రాధాన్యంలో గెలిచేందుకు వీలుగా 105 మంది సభ్యులు అవసరం కాగా, మరో నలుగురి మద్దతు సమీకరణ ప్రయతాల్లో పార్టీ ఉంది. ఈ నెల 9వ తేదీ వరకు కొత్తగా చేరికలు, మద్దతు సమీకరణలు జరపాలని టిఆర్‌ఎస్‌ భావిస్తుంది. వీలైనంత వరకు ప్రథమ ప్రాధాన్యత ఓట్లతోనే గెలవాలని టిఆర్‌ఎస్‌ భావిస్తుంది. వీలుకాని పక్షంలో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల గురించి సమావేశంలో తెలియజేస్తారు.