బీహార్ కు బయలుదేరిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ కు బయలుదేరారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి పాట్నా బయలుదేరి వెళ్లారు. కేసిఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, జాతీయ రైతు సంఘాల నేతలు ఉన్నారు.

గతంలో ప్రకటించిన విధంగా గల్వాన్‌ లోయలో మరణించిన ఐదుగురు బీహార్‌ సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. అదేవిధంగా సికింద్రాబాద్‌ టింబర్‌ డిపోలో ఇటీవల మరణించిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తారు. బీహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌తో కలిసి వారికి చెక్కులను అందజేస్తారు. అనంతరం నీతీశ్‌ నివాసానికి వెళ్లి అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్, నితీశ్ చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నితీశ్ మళ్లీ తిరిగి బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేసి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఇటీవల దేశ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే.