కేసీఆర్ జాతీయ పార్టీ ముహూర్తం ఫిక్స్..

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసారు. దసరా రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. యావత్ దేశం మొత్తం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా దసరా రోజున కేసీఆర్ తన జాతీయ పార్టీ ని ప్రకటిస్తారని, లేదు లేదు అంతకంటే ముందే ప్రకటిస్తారని , మరికొంతమంది డిసెంబర్ లో ప్రకటిస్తారని ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే కేసీఆర్ మాత్రం దసరా రోజునే పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసారు.

దసరా పండుగ రోజున టీఆర్‌ఎస్‌ కార్యవర్గ పార్టీ సమావేశం జరుగనున్నది. జాతీయ పార్టీగా మార్పుపై 283 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులతో విస్తృత స్థాయి తీర్మానం ప్రవేశపెట్టి.. ఆమోదం తెలుపనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు మూహూర్తం నిర్ణయించగా.. జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయనున్నారు. ఈ క్రమంలో డిసెంబర్‌ 9న ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

కేసీఆర్ దసరా రోజు ప్రకటించబోయే జాతీయ పార్టీ గురించి పలు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో భారత రాష్ట్రీయ పార్టీ, మహాభారత్ రాష్ట్రీయ పార్టీ , నవభారత్ రాష్ట్రీయ పార్టీ పేర్లు ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎవరూ వాడని పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీ పేరు మారినా, కారు గుర్తు ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.