తెలుగు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్ , జగన్

ఈరోజు శ్రీరామనవమి సందర్భాంగా తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ , జగన్ మోహన్ రెడ్డి లు శుభాకాంక్షలు అందజేశారు. ” “ధర్మో రక్షతి రక్షితః” సామాజిక విలువను తు.చ. తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు సీతారామ చంద్రుడు భారతీయుల ఇష్ట దైవమని కేసీఆర్ కీర్తించారు.

లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర భార్యాభర్తల బంధం అజరామరమైనదని, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని సీఎం తెలిపారు. భద్రాచల సీతారాముల వారి ఆశీస్సులు సదా రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని శ్రీ సీతారాములను కేసీఆర్ ప్రార్థించారు. అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా ఈ పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అన్ని శుభాలు కలిగేలా శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభిలషించారు.