కేసీఆర్ నిర్ణయం ఫై అంత హర్షం వ్యక్తం చేస్తున్నారు

Telangana secretariat building likely to be named after Ambedkar

తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహేబ్‌ అంబేద్కర్‌ పేరును పెట్టాలని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ నూతన సచివాలయానికి బాబాసాహెబ్ బీ.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టడం యావత్ జాతికి గర్వకారణమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూసి దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరును వందలకోట్లతో నిర్మించిన అత్యాధునిక సచివాలయానికి పెట్టడం ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. స‌చివాల‌యానికి అందరివాడైనా అంబేద్కర్ పేరు పెట్టడం మ‌నంద‌రికీ గ‌ర్వకారణం అని, అంబేద్కర్ భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులతో ప్రతి ఒక్కరూ తల ఎత్తుకొని ధైర్యంగా, ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. అలాంటి మహానుభావుని పేరుని తెలంగాణ స‌చివాల‌యానికి పెట్టడం గొప్ప నిర్ణయమని మంత్రి ఇంద్రకరణ్‌ చెప్పుకొచ్చారు.

అలాగే ఈ నిర్ణయాన్ని ఇది చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు ఎమ్మెల్సీ కవిత. అంబేద్కర్‌పైన ఉన్న గౌరవాన్ని సీఎం కేసీఆర్ మరోసారి సగర్వంగా చాటుకున్నారన్నారు. పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరును పెట్టి బీజేపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తెలంగాణ సమాజం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎంపీ నామా నాగేశ్వర్‌రావు.