మోడీ రాక నేపథ్యంలో కేసీఆర్ మరో మాస్టర్ ప్లాన్..

గత కొద్దీ నెలలుగా టిఆర్ఎస్ vs బిజెపి గా వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బిజెపి హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పటు చేయడం..జులై 03 న పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తుండడంతో వార్ మరింత వేడెక్కింది. ఎలాగైనా ఈ సభ తో బిజెపి తన సత్తా చాటాలని చూస్తుంది. అయితే బిజెపి ప్లాన్లకు కేసీఆర్ చెక్ పెడుతూ వస్తున్నారు. ఈ సమావేశాలకు ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హైదరాబాద్ రాబోతుండడం తో బిజెపి నేతలంతా భాగ్యనగరాన్ని మొత్తం కమలమయం చేయాలనుకున్నారు కానీ అంతకంటే ముందే టీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలతో ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తూ నగరమంతా ఫ్లెక్సీలతో నింపేశారు. ప్రధాని మోడీ పర్యటించే బేగంపేట, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, HICC నోవాటెల్ ప్రాంతాల్లో భారీగా హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. అంతే కాదు ఇప్పుడు కేసీఆర్ మరో మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది.

మోడీ హైదరాబాద్ లో పర్యటించే రోజే, నగరంలో తమ సత్తా తెలిసేలా భారీ ర్యాలీ నిర్వహించాలని టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో జూలై 2వ తేదీన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు రానున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ, భారీ ర్యాలీ నిర్వహించాలని టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. యశ్వంత్ సిన్హా రాక నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్ కు భారీ ర్యాలీ నిర్వహించడానికి టిఆర్ఎస్ వర్గాలు సమాయత్తమవుతున్నాయి. ఎయిర్ పోర్ట్ నుండి జలవిహార్ వరకు భారీ ర్యాలీతో ,.. బీజేపీకి షాక్ ఇవ్వనున్న టీఆర్ఎస్ ఎయిర్ పోర్ట్ నుండి జలవిహార్ వరకు దారిపొడుగునా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో నింపి హంగామా చేయాలని భావిస్తున్నారు. ప్రధాని మోడీ రాక నేపథ్యంలో, బిజెపి హంగామా కు చెక్ పెట్టడం కోసం, యశ్వంత్ సిన్హా రాకపై భారీ ర్యాలీ టిఆర్ఎస్ పార్టీ నిర్వహించనుందని తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేటీఆర్ నేతలతో సమావేశమయ్యారు. మరి మోడీ రాక రోజు ఏంజరుగుతుందో చూడాలి.