కేసీఆర్​ చేతుల మీదుగా టీ-హబ్​ 2.0 ప్రారంభం

హైదరాబాద్ నగరం పేరు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. భాగ్యనగరంలో టీ-హబ్​ 2.0 ప్రారంభమైంది. రాయదుర్గంలో నిర్మించిన టీహబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం టీ హబ్​ సెంటర్​ను పరిశీలించారు. సెంటర్‌ ప్రత్యేకతలను అధికారులు సీఎంకు వివరించారు. కేసీఆర్ వెంట ఐటీ మంత్రి కేటీఆర్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌తో పాటు ప‌లువురు ఉన్నారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు టీహబ్‌-2 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

రూ.276 కోట్ల వ్యయంతో శాండ్‌విచ్‌ ఆకారంలో నిర్మాణం చేపట్టారు. టీహబ్ ఫెసిలిటీ సెంటర్‌లో ఏకకాలంలో 2వేలకుపైగా స్టార్టప్‌లు నిర్వహించేందుకు వీలుగా ఆధునాతన సౌకర్యాలు కల్పించారు. అత్యంత విశాలమైన ప్రాంగణం అత్యాధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. చుట్టూ ఐదు విశాలమైన రోడ్లతో కూడలి ఉండటం టీహబ్‌ 2.0 ప్రత్యేకంగా నిలుస్తోంది. తక్కువ కాలంలోనే ఎక్కువ ఆవిష్కరణలు జరిగే అవకాశం కల్పించారు. ప్రపంచంలోని ఉత్తమ ఇంక్యుబెటర్స్‌తో పోటీపడే స్థాయికి టీహబ్ చేరుకుంటుందని ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సంద‌ర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. టీ హ‌బ్ స్థాపించాల‌నే ఆలోచ‌న‌కు ఎనిమిదేళ్ల కిందే అంకురార్ప‌ణ జ‌రిగింద‌న్నారు. ప్ర‌పంచంలో యువ భార‌త్ సామ‌ర్థ్యాన్ని తెలుపాల‌ని టీ హ‌బ్ ప్రారంభించిన‌ట్లు చెప్పారు. 2015లో మొద‌టి ద‌శ టీ హ‌బ్‌ను ప్రారంభించామ‌ని వెల్ల‌డించారు. ఏడేళ్ల త‌ర్వాత టీ హ‌బ్‌ రెండో ద‌శ ప్రారంభించ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు. ఏడేళ‌ల్లో టీహ‌బ్ ద్వారా 1200 అంకురాల‌కు స‌హ‌కారం అందించిన‌ట్లు చెప్పారు. మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు అంకురాలు దోహ‌దం చేస్తాయ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. టీ హ‌బ్‌ను విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు అధికారుల‌ను అభినందించారు.

హైద‌రాబాద్‌ను స్టార్ట‌ప్ క్యాపిట‌ల్‌గా రూపొందించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. ప్ర‌పంచంలో హైద‌రాబాద్ ఉత్త‌మ న‌గ‌ర‌మ‌ని పేర్కొన్నారు. తెలంగాణ.. స్టార్ట‌ప్ స్టేట్ ఆఫ్ ఇండియాగా ఉండ‌బోతుంద‌న్నారు. యువ వ్యాపార‌వేత్త‌ల‌ను త‌యారుచేయ‌డమే టీ హ‌బ్ ల‌క్ష్య‌మ‌ని వెల్ల‌డించారు. స్టార్ట‌ప్‌ల‌కు ప్ర‌భుత్వ‌మే ప్రోత్స‌హించ‌డం తెలంగాణ‌లోనే ప్రారంభ‌మైంద‌న్నారు. స్టార్ట‌ప్‌ల ద్వారా అపార‌మైన ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని చెప్పారు. మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు అంకురాలు దోహ‌దం చేస్తాయ‌న్నారు. టీ హ‌బ్‌లో ఇప్ప‌టికే చాలా కంపెనీలు త‌మ ప్రొడ‌క్టుల‌ను ప్రారంభించాయ‌ని చెప్పుకొచ్చారు.