యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ.43 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యాదగిరిగుట్ట అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసారు. శుక్రవారం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.43కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వెంటనే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వైటీడీఏకు 2,157 ఎకరాలు అప్పగిస్తామని, ఇందులో ఆలయ అర్చకులు, ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించనున్నట్లు తెలిపారు. దాతలకు కాటేజీ నిర్మాణాలకు ఇచ్చే విరాళాలకు ఐటీ మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. యాదాద్రిలో హెలిప్యాడ్‌ నిర్మించాలని ఆదేశించారు. 100 ఎకరాల్లో నృసింహ అభయారణ్యం ఏర్పాటు చేస్తామని, 50 ఎకరాల్లో కల్యాణ మండపం నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. 250 ఎకరాల్లో కాటేజీల నిర్మాణం చేపడుతామన్నారు. యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభ ఉండేలా అనుబంధ నిర్మాణాలు చేపట్టాలని వైటీడీఏను ఆదేశించారు.

ఇక కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాగా.. స్వామి వారి గర్భగుడి దివ్య విమానానికి బంగారు తాపడం కోసం 125 కిలోల బంగారం పట్టనుంది. దీనికోసం దాతలు సైతం భాగస్వామ్యం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తన కుటుంబం తరుఫున కేసీఆర్ కిలో 16 తులాల బంగారాన్ని ప్రకటించారు. నేడు దేవస్థానంలో ముఖ్యమంత్రి దంపతులు తమ మనవడు హిమాన్షు చేతుల మీదుగా ఆ బంగారాన్ని అందజేశారు. పూజ‌ల అనంత‌రం కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.