రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఆడపడుచుల సంబురం సద్దుల బతుకమ్మ పండుగ రానే వచ్చింది. తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా అలంకరించి.. సంప్రదాయ దుస్తుల్లో మహిళలంతా ప్రకృతిలో మమేకమై ఆనందంగా ఆడుతూ పాడుతూ ఈరోజు గౌరమ్మకు వీడ్కోలు పలుకుతారు. ఎంగిల పూల బతుకమ్మలతో ప్రారంభమైన ఈ పండుగ..ఈరోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఇక బతుకమ్మ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ..ఇతర రాష్ట్రాల్లు సహా విదేశాల్లోనూ సందడిగా జరుపుకుంటున్నారు. పట్టణాలు, పల్లెలు, ధనిక పేదా అన్న తేడా లేకుండా మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సంతోషంగా బతుకమ్మ జరుపుకుంటూ వస్తున్నారు.

ఇక ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్బంగా తెలంగాణ ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో జలకళతో కళకళలాడుతున్న చెరువులు, పచ్చదనంతో నిండుగా అలరారుతున్న పొలాల పక్కన ప్రకృతిలో మమేకమై రాష్ట్ర ఆడబిడ్డలంతా సంబురంగా సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. మహిళల ఆటపాటలతో ఈ తొమ్మిది రోజులు రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్నాయని అన్నారు.

విజయాలను అందించే విజయదశమిని స్వాగతిస్తూ.. తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా దీవించాలని మరోసారి అమ్మవారిని కేసీఆర్ ప్రార్థించారు. అలాగే బతుకమ్మ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసులతో పలు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసింది.