ఖమ్మం జిల్లాలోని గ్రామాలకు సీఎం కేసీఆర్ వరాల జల్లు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలోని గ్రామాలకు వరాల జల్లుకురిపించారు. నేడు ఖమ్మంలో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ భారీ సభలో పాల్గొని ఖమ్మం జిల్లాలోని గ్రామాలకు వరాల జల్లు కురిపించారు. జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

పెద్దతాండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి 10 వేల జనాభాకు మించి ఉండి.. మేజర్‌ గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలకు ఒక్కోదానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి మరొక రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలకు మధిర, వైరా, సత్తుపల్లి కి తలా రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో మంజూరు చేస్తామని ఈ సందర్బంగా ప్రకటించారు.

ఖమ్మం హెడ్‌ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్‌ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు.