ఢిల్లీకి బయలుదేరిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేసీఆర్ వెంట రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మరియు సీఎస్ సోమేష్ కుమార్ లు వెళ్లడం జరిగింది. ఈ నెల 25న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కేసీఆర్ సమావేశం కానున్నారు.
26న విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తీవ్రవాద ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశం పై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో మాట్లాడుతారు. ఇక 26 తేదీ సాయంత్రమే తెలంగాణ సీఎం కేసీఆర్ హైదారాబాద్ తిరుగు ప్రయాణమౌతారు. ఢిల్లీకి వెళ్లే ముందు తెలంగాణ శాసన సభ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈరోజు సమావేశాల్లో ఇటీవల మరణించిన శాసనసభ్యులకు సంతాపాలు ప్రకటించారు.
అసెంబ్లీలో అజ్మీర్ చందూలాల్, కేతిరి సాయిరెడ్డి, ఎంఎస్ఆర్, మాచర్ల జగన్నాథం మృతికి సంతాపం తెలిపారు. మండలిలో రెహమాన్, లింబారెడ్డి, లక్ష్మారెడ్డిలకు నివాళులర్పించారు. మొత్తం 9 మంది మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించి ఉభయసభలు సోమవారానికి వాయిదా వేశారు. ఇక ఈ సమావేశాల్లో ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన దళిత బంధు పథకంపై చర్చించనున్నారు. దీనిపై ప్రత్యేక చర్చ చేపట్టాలని సీఎం కేసీఆర్ స్పీకర్ అనుమతి కోరే అవకాశం ఉంది. యాసంగిలో వరిసాగు, ధాన్యం కొనుగోలు అంశం, తెలుగు రాష్ర్టాల మధ్య జలజగడం, ఉద్యోగ నియామకాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ ప్రైవేటీకరణ, విద్యుత్ ఛార్జీల పెంపు సహ ఇతర అంశాలపై సభ్యులు చర్చించనున్నారు.