అవినీతిలో కేసీఆర్ కుటుంబం లిమిట్ దాటింది – విజయశాంతి

అవినీతిలో కేసీఆర్ కుటుంబం లిమిట్ దాటిందని విమర్శించారు బిజెపి నేత విజయశాంతి. ఈరోజు బండి సంజయ్ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్న ఆమె..కేసీఆర్ కుటుంబం ఫై నిప్పులు చెరిగారు. ఒక మహిళ లిక్కర్ స్కామ్ లో ఉండటం ఏమిటి అని ప్రశ్నించిన విజయశాంతి కవిత తెలంగాణ రాష్ట్రం పరువు తీసింది అంటూ మండిపడ్డారు. బీజేపీ నేతల పైన పరువు నష్టం దావా వేయడంపై సీరియస్ గా స్పందించిన విజయశాంతి 33 జిల్లా కోర్టులలో పిటీషన్లు వేస్తే బీజేపీ భయపడుతుందా అని ప్రశ్నించారు. నిప్పులేనిదే పొగ రాడని, కవిత ప్రమేయం లేకుండా ఆమె పేరు బయటకు రాదని విజయశాంతి పేర్కొన్నారు.

తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ రావాలని విజయశాంతి అన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. కేసీఆర్ 5లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ను గద్దె దించాలని..రాష్ట్రం నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొట్టాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. దేశం మొత్తంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అంత అవినీతి చేయలేదని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. సరైన సమయంలో మిమ్మల్ని ఈడి కచ్చితంగా పిలుస్తుంది అని పేర్కొన్న విజయశాంతి, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వాటంతటవే బయటకు వస్తాయి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టిఆర్ఎస్ పార్టీ కౌంట్ డౌన్ ప్రారంభమైందని, బిజెపిని అడ్డుకోవడానికి టిఆర్ఎస్ చేసే అక్రమ ప్రయత్నాలు చెల్లవని విజయశాంతి వెల్లడించారు. కెసిఆర్ కుమార్తె పై ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని విజయశాంతి ప్రశ్నించారు.బండి సంజయ్ పాదయాత్ర ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, కార్యకర్తలను కొడుతున్నారని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అయినప్పటికీ భయపడే ప్రసక్తే లేదని బిజెపి నేత విజయశాంతి తేల్చిచెప్పారు.