కడెం వరద తీవ్రతఫై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా…

తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని ప్రాజెక్ట్ లకు వరద తీవ్రత ఎక్కువ అవుతుంది. దీంతో ప్రాజెక్ట్ ల గేట్లు ఎత్తివేస్తూ నీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, అధికారులు 17 గేట్లు ఎత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. అయితే అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు ఎక్కువ ఉండడంతో ప్రాజెక్టు కట్ట పైనుంచి నీరు ప్రవహిస్తుంది. అయితే వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచిఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఈ క్రమంలో వరద తీవ్రత ఫై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి ఫోన్‌చేసి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని కేసీఆర్‌ ఆదేశించారు. మంపు గ్రామాలు, సహాయక చర్యలను కేసీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. కడెం, దస్తురాబాద్ మండలాలకు చెందిన 20 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోపక్క భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 52 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. దీంతో రామాలయం పడమరమెట్ల వద్ద నీరుచేరింది. ఆలయ దుకాణాలు నీటమునిగాయి. అన్నదాన సత్రంలోకి వరద నీరుచేరడంతో భక్తులకు అన్నదానం నిలిపివేశారు. ఇక భద్రాచలంలోని కొత్త కాలనీ, అయప్ప కాలనీ ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్నది.