కర్ణాటక బస్సు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్‌

కర్ణాటక కలబురగిలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన లో హైదరాబాద్ కు చెందిన ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..మృతి చెందిన వారికీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేసీఆర్‌.. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఇస్తున్నట్టు కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందేలా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మృతదేహాలను వారి స్వస్థలానికి తరలించేలా చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావులకు నిర్దేశించారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. కమలాపూర్ సమీపంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును టెంపో ఢీకొట్టడంతో.. డీజిల్ ట్యాంకుకు మంటలు అంటుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారంతా హైదరాబాద్ వాసులే. నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అర్జున్ కుమార్.. తన కుమారుడి పుట్టినరోజు, సమ్మర్ హాలిడేస్ సందర్భంగా బంధువులతో కలిసి మొత్తం 26 మంది ఆరెంజ్ ట్రావెల్ బస్సులో సుచిత్ర- కొంపల్లి ఏరియా నుంచి మే 29వ తేదీ సాయంత్రం సమయంలో గోవా బయల్దేరి వెళ్లారు. అక్కడ వేడుకలు ఘనంగా జరుపుకొని తిరిగి బయలుదేరారు. బస్సు కర్ణాటకలోకి కలబురగి జిల్లా కమలాపూర్ రాంగ్ రూట్ లో వచ్చిన టెంపో ఒక్కసారిగా ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో డీజిల్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది ఉండగా.. అందులో 26 మంది ఒకే కుటుంబానికి చెందిన వారే. బస్సులోనే నలుగురు సజీవ దహనం కాగా.. మరో నలుగురు హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. మరో 11 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మృతులను శివకుమార్, సరళ, అర్జున్ కుమార్, రవళి, అనిత, బివాన్, దీక్షిత్‌గా గుర్తించారు.