అమరులైన రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.. 3 లక్షల ఎక్స్ గ్రేషియా – కేసీఆర్

రైతు చట్టాలకు వ్యతిరేకంగా అమరులు అయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.. 3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రం రైతు చట్టాలను రద్దు చేయడంలో రైతులు ఎంతో కృషి అభినందనీయమని..ఈ చట్టాలను రద్దు చేసేవరకు తమ ప్రాణాలను కూడా లెక్క చేయలేదని కేసీఆర్ అన్నారు.

రైతుల పట్ల కేంద్రం వ్యవహరించిన తీరు వ‌ల్ల 700 నుంచి 750 మంది రైతులు ఆత్మార్ప‌ణం చేశారు. గుండెజ‌బ్బులు వ‌చ్చి.. ఒత్తిడికి లోనయి కొంద‌రు.. ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కొంద‌రు చ‌నిపోయారు. వాళ్లంద‌రికీ సంఘీభావం ప్ర‌క‌టిస్తున్నాం. వాళ్ల కుటుంబాలు రోడ్డున ప‌డ‌కూడ‌దు కాబ‌ట్టి.. ఆ కుటుంబాలను కాపాడే బాధ్య‌త ప్ర‌ధాని తీసుకోవాలి.. అని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి అమ‌రుల కుటుంబాల‌కు 3 ల‌క్ష‌ల సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. దాని కోసం రూ..22.5 కోట్లు దానికి ఖ‌ర్చు అవుతాయని తెలిపారు. కేంద్రం కూడా ఆ కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతుల పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని.. దీన్ని కేంద్రం పాజిటివ్ గా తీసుకోవాలి.. నెగిటివ్ గా తీసుకోవద్దని వెల్లడించారు.