కేసీఆర్ ఏరియల్ సర్వే షెడ్యూల్ ..

సీఎం కేసీఆర్ రేపు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టబోతున్న విషయం తెలిసిందే. ఒక్కరోజే ఏరియల్ సర్వే ఉంటుందని అనుకున్నప్పటికీ , కేసీఆర్ రెండు రోజుల పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టబోతున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ విడుదలైంది. శనివారం సాయంత్రం కేసీఆర్ హన్మకొండ కు చేరుకున్నారు. ప్రత్యేక బస్సులో రోడ్డుమార్గం ద్వారా వరంగల్‌లోని కెప్టెన్‌ లక్ష్మి కాంతారావు ఇంటికి చేరుకున్నారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖమంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వివిధ శాఖల అధికారులు సీఎం వెంట ఉన్నారు. ఇక గోదావరి పరీవాహక ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. వరద పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. వరదల నష్టం వివరాలపై ఆరా తీశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు.

ఆదివారం ఉదయం 7 గంటలకు కేసీఆర్ వరంగల్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. ఉదయం 7.45 గంటలకు భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. అనంతరం వరద పరిస్థితి, సహాయ, పునరావాస కార్యక్రమాలపై అక్కడి అధికారులతో చర్చించనున్నారు. ఉదయం 9.30గంటలకు భద్రాచలం నుంచి బయలు దేరి 9.45గంటలకు ఏటూరు నాగారం, ములుగు మండలాల్లో పరిస్థితిని సమీక్షించనున్నారు. 11 గంటలకు అక్కడి నుంచి బయలు దేరి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

హైదరాబాద్ చేరుకున్న అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆదివారం హైదరాబాద్ లోనే బస చేసి.. సోమవారం తిరిగి ఉత్తర తెలంగాణలోని ఎస్సారెస్పీ, కడెం,కాళేశ్వరం, వరదబాధిత ప్రాంతాలలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.