తెలంగాణ లో భారత్ జోడో యాత్ర పబ్లిసిటీ చేయడం లేదంటూ రేవంత్ ఫై వేణుగోపాల్ ఫైర్

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 23 నుంచి వచ్చే నెల 6 వరకు తెలంగాణ లో కొనసాగబోతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రాహుల్ యాత్రపై సమీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం హైదరాబాద్ వచ్చారు. గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా టీ కాంగ్రెస్ నేతలపై వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేసారు. భారత్ జోడో యాత్ర పట్ల తెలంగాణలో పెద్దగా ప్రచారమే జరగడం లేదని వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పబ్లిసిటీలో అందరికంటే ముందు ఉండే రేవంత్ రెడ్డి… జోడో యాత్ర పబ్లిసిటీలో మాత్రం ఎందుకు వెనుకబడ్డారంటూ నేరుగా రేవంత్‌నే ఆయన ప్రశ్నించారు. ఇకనైనా జోడో యాత్ర ప్రచారాన్ని పెంచాలని ఆయన రేవంత్‌కు సూచించారు.
‘భారత్ జోడో యాత్ర’కు తెలంగాణలో రూట్ మ్యాప్ ఖరారైంది. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ వద్ద రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించి… జహీరాబాద్ జిల్లా మద్నూర్ వరకు కొనసాగుతుంది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 6 వరకు రాహుల్ యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది.
ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ప్రకటన రిలీజ్ చేశారు. భారత్ జోడో యాత్ర గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఇందుకోసం పంచాయతీ భవన పరిసరాలలో వాల్ రైటింగ్స్ చేయించాలని పార్టీ నాయకులను కోరారు. రాహుల్ యాత్ర ఆద్యంతం ప్రతి రెండు కిలో మీటర్లకు ఓ నాయకుడు బాధ్యత తీసుకొని యాత్ర సజావుగా సాగేలా చూడాలని తెలిపారు.