ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ ఖాయం – బండి సంజయ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయమన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈడీ ఎదుట ఈరోజు కవిత హాజరుకావాల్సి ఉండగా..ఆమె తరపు లాయర్ భరత్ ఈడీ ఆఫీసుకు వెళ్లి డాక్యుమెంట్లు సమర్పించారు. చట్టానికి వ్యతిరేకంగా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారని.. ఈ విషయంపైనే సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశామని.. మార్చి 24వ తేదీ విచారణకు వస్తుందని.. కోర్టు చెప్పినట్లు నడుచుకుంటాం అన్నారు.

ఈ నేపథ్యంలో కవిత అరెస్టు ఖాయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీలో కవిత అరెస్టు కోసం అంతా రెడీ అవుతుందని అన్నారు. ఏ సమయంలోనైనా ఆమెను అరెస్టు చేస్తారని చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవని వ్యాఖ్యానించారు బండి సంజయ్.

అలాగే కవిత ఈడీ విచారణ అంత కూడా నాటకమే అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. బిఆర్ఎస్ – బిజెపి పార్టీలది మిత్రభేదమే అంటూ మండిపడ్డారు. వాటాల పంపకంలో తేడా రావడం వల్లే చిల్లర పంచాయితీ అంటూ రేవంత్ వ్యాఖ్యలు చేసారు. సోనియా గాంధీని ఈడీ విచారించినప్పుడు కవిత, కెసిఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.