బాలీవుడ్ స్టార్ బ్యూటీకి కరోనా

బాలీవుడ్ తారలు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో అక్కడి సినీ పరిశ్రమ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పటికే పలువురు స్టార్ యాక్టర్స్‌కు కరోనా పాజిటివ్ సోకిందని, వారు ఐసోలేషన్‌లో ఉన్నట్లు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కరోనా సోకిన స్టార్స్‌లో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌషల్, అక్షయ్ కుమార్, భూమి పద్నేకర్ వంటి వారు ఉన్నారు.
కాగా తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ బ్యూటీ వచ్చి చేరింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే బాంబును పేల్చడంతో ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా హడలిపోయాయి. తనకు కరోనా పాజిటివ్ రావడంతో, క్వారంటైన్లో ఉన్నానని కత్రినా చెప్పుకొచ్చింది. అయితే కరోనా టెస్ట్‌కు ముందు రోజు, కత్రినా తన సోదరితో ఓ స్టార్ హోటల్లో దర్శనమివ్వడం గమనార్హం. దీంతో కత్రినాకు కరోనా ఎలా సోకిందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇక కత్రినా కైఫ్‌తో పాటు ఆమె సోదరి కూడా క్వారంటైన్లో ఉందని, తనను కలిసిన వారందరూ కరోనా టెస్టు చేయించుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరింది. ఇలా బాలీవుడ్‌కు చెందిన చాలా మంది స్టార్స్ కరోనా బారిన పడుతుండటంతో సినీ ప్రేమికులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా మహారాష్ట్రలోని ముంబై ప్రాంతంలో కరోనా మహమ్మారి భారీగా విజృంభిస్తుండటంతో అక్కడి అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.