సైనాను మందలించిన కశ్యప్‌…

kashyap, saina
kashyap, saina


న్యూఢిల్లీ: ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ల పోరాటం శుక్రవారంతో ముగిసింది. శుక్రవారం భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ కూడా నిష్క్రమించింది. రెండు సార్లు క్వార్టర్‌లో ఆల్‌ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌ తైజు యింగ్‌ చేతిలో సైనా నెహ్వాల్‌ పోరాడి ఓడిపోయింది. తైజు చేతిలో సైనా నెహ్వాల్‌ ఓడిపోవడం ఇది వరుసగా 13వసారి కావడం విశేషం. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌తో తలపడుతున్న సమయంలో అనవసర తప్పిదాలు చేస్తూ మ్యాచ్‌ చేజార్చుకుంటున్న సైనాను చూసి కశ్యప్‌ ఒకింత ఆగ్రహానికి గురయ్యాడు. ఒకానొక దశలో సైనా నెహ్వాల్‌ తొలి గేమ్‌లో 3-11తో వెనకబడి ఉంది. ఆ సమయంలో సైనా ఆటతీరుపై కోచ్‌ స్థానంలో కూర్చున్న ఆమె భర్త కశ్యప్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నువ్వు మ్యాచ్‌ గెలవాలని అనుకుంటే క్రమశిక్షణతో ఉండాలని అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా ఆడు అని మ్యాచ్‌ బ్రేక్‌ టైంలో సైనాను మందలించాడు. ఆ తర్వాత తన వ్యూహాలను పదును పెట్టిన సైనా ప్రత్యర్థిని కోర్టులో పరిగెట్టేలా చేసి 12-14తో స్కోరు అంతరాన్ని తగ్గించింది.అయితే తిరిగి పుంజుకున్న తై జు క్రమంగా పాయింట్లు సాధించి 21-15తో తొలిగేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక తొలి గేమ్‌ అనంతరం మరోసారి కశ్యప్‌ సైనాకు సలహాలిచ్చాడు.