ఆసక్తి పెంచిన కార్తికేయ 2 ట్రైలర్

\విభిన్న కథలతో ప్రేక్షకులకు ఎప్పుడు కొత్తదనం అందించడంలో యంగ్ హీరో నిఖిల్ ముందుంటాడు. ఇప్పటికే పలు చిత్రాలతో ఆకట్టుకున్న నిఖిల్..ఇప్పుడు కార్తికేయ 2 రాబోతున్నాడు. చందూ మొండేటి – నిఖిల్ కలయికలో 2014 లో వచ్చిన కార్తికేయ‌ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ మాత్రమే కాదు వసూళ్ల వర్షం కురిపించింది. ఇపుడీ చిత్రానికి సీక్వెల్ కార్తికేయ 2 రాబోతుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ మూవీ ట్రైల‌ర్ను మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేసారు.

‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్ కి కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా అత్యద్భుతమైన విజువల్ ఫీస్టుగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.

ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం. శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నారు ఈయన. ఈ చిత్రంలోని భావాన్ని ట్రైలర్ రూపంలో ద‌ర్శ‌కుడు చందు మొండేటి ప్రేక్ష‌కుల క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు.

ఇక డైరెక్టర్ చందూ మొండేటి మరోసారి ఉత్కంఠభరితమైన ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నాడని ‘కార్తికేయ 2’ ట్రైలర్ సూచిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ట్రైలర్ కట్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. కాల భైరవ నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాహి సురేష్ ఆర్ట్ వర్క్ అభినందనీయం. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జులై 22న ప్రపంచంలో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.