సర్వ పుణ్యముల ఫలం కార్తీక పౌర్ణమి

నేడు కార్తీక పౌర్ణమి పర్వదినం

Karthika deeparadhana
Karthika deeparadhana

హరిహర స్వరూపమైన కార్తీక మాసం కైవల్యప్రదమైంది. జన్మ జన్మల పాపాల్ని పటాపంచలు చేసి మానవాళికి మోక్షాన్ని ప్రసాదించే ఈ మాసంలో మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి.

స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ మాసంలో కార్తీకపున్నమి నోము నోచుకుంటారు. ఈ మాసంలో సత్యనారాయణ వ్రతాలు ఆచరించడం పరిపాటి. ఏ దిక్కున తిరిగి నమస్కారం ఆచరించినా అది హరిహరాదులకు
చేరుతుంది.

కార్తీక స్నానం..

కార్తీక మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉండటం చేత ఈ నెలకు ‘కార్తీకం అనే పేరు వచ్చింది. కృత్తికా నక్షత్రం అస్తమించేలోగా అంటే తెల్లవారుఝాముననే స్నానం చేయాలి. ఈ మాసమంతా చన్నీటితోనే స్నానాలు చెయ్యాలి.

కార్తీకపౌర్ణమి అనగానే సముద్ర స్నానం చేయడం ఒక విశిష్ట లక్షణం. యేడాదిలో శ్రావణం, కార్తీకం, మాఘం,వైశాఖ మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజున మాత్రం తప్పక సముద్ర స్నానం చేయాలని వేద ప్రమాణం. సముద్రస్నానం చేయడం వల్ల సమస్త చర్మవ్యాధులు నశించిపోతాయి.

ఈ పున్నమి రోజున చేసే స్నానం, దీపారాధన, ఉపవాసంవంటివాటిల్లో ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి.

కార్తీక సోమవారం వ్రతం..

సోమవారం రోజు పూర్తిగా పగలంతా ఉపవాసం ఉండి, ప్రదోష సమయంలో అంటే సాయంత్రం వేళ అభిషేకాలు, అర్చనలు చేసి తులసి తీర్థం స్వీకరించి ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా కార్తీక సోమవారాలు వ్రతం చేయాలి.

కార్తీక దీపం.. కార్తీక మాసంలో ఆచరించే మరొక ముఖ్య సాంప్రదాయం దీపారాధన. సాయం సంధ్యలో ఆలయ ప్రాంగణాలలో శివలింగం ముందు దీపం పెట్టడం ఆచారంగా వస్తున్నది.

సర్వజ్ఞాన ప్రదం దీపం. ‘సర్వజ్ఞాన ప్రదం దీపం, సర్వ సంపత్సుఖావహం అని శాస్త్రోక్తి. ఉభయ సంధ్యలలో శివకేశం ఆలయాల్లో తులసి సన్నిధిలో ఉసిరికాయపైన వత్తి నుంచి వెలిగించడం ఆచారంగా వస్తున్నది.

‘దీపం జ్యోతిః పరబ్రహ్మ – దీపం సర్వతమో వహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే

అనగా దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం అన్ని రకాల చీకట్లను పారద్రోలుతుంది. దీపం సమస్తాన్ని సాధిస్తుంది. దీపం లేనిదే ఏదీ సాధ్యం కాదు. కనుక సంధ్యలో పెట్టిన దీపానికి నమస్కరించాలి.

కార్తీక మాసంలో పెట్టే ఆకాశదీపాలు మానవ హృదయాకాశంలో వెలిగే పరబ్రమ్మ జ్యోతికి ప్రతీకలు. కార్తీకమాసంలో శ్రీకృష్ణుని ఆరాధించడం కూడా బహు శ్రేష్టమైనది.

తులసి సన్నిధిలో దీపాలు పెట్టడం, తులసి మాలను ధరించడం, గోవర్ధనపూజ, గోపూజ చేయడం శ్రీకృష్ణ భగవానుని ఆరాధనలో భాగమే.

దీపదానం ఫలితం..

‘సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపత్సుఖాహం
దీప దానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామయః

అనగా సర్వవిధాలైన జ్ఞానాన్ని అందించి సకల సంపదలను కలుగచేసేటువంటిది. చీకట్లను పారద్రోలి, వెలుగు రేఖలను నింపేదియైన దీపాన్ని నేను దానం చేస్తారు. ఈ దీపదానంతో సంపూర్ణ క్షేమం కలుగుతుంది. అని పై శ్లోకానికి అర్ధం. కార్తీక పున్నమి రోజున ఈ శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని బ్రాహ్మోణోత్తమునికి దానం చేయాలి.

కార్తీకమాసంలో స్నానం, ఉపవాసం వలె దీపారాధన, దీపదానం కూడా ఎంతో ముఖ్యమైనవి. ఈ మాసంలో ఉభయ సంధ్యల్లో శివకేశ ప్రీతికై దీపారాధన చేయడం ఎంతో ముఖ్యం. దానివల్ల ఎన్నో శుభాలు చేకూరుతాయి.

కార్తీకమాసంలో అనుదినం బియ్యపు పిండి లేదా గోధుమపిండిలో ఆవ్ఞనెయ్యి పోసి దీపంపెట్టాలి. వెలుగుతున్న దీపాన్ని దానం చేయాలి.

ఈ విధంగా నెలంతా చేసి, నెల చివరల్లో పైడిపత్తితో బియ్యపు పిండితో కుందిచేసి అందులో వత్తివేసి ఆవునెయ్యితో వెలిగించాలి. వెలుగుతున్న ఈ దీపాన్ని సువర్ణంతో బ్రాహ్మణునికి దానం ఇయ్యాలి. ఇలా చేయడం వల్ల సంసారంలో ఉన్న ఈతిబాధలు పోతాయి. ఇహపర సౌఖ్యం లభిస్తుంది.

రుణబాధలు తీరుతాయి. ఆరోగ్యం మెరుగవ్ఞతుంది. ప్రార్భ కర్మలు నశిస్తాయి. ఆవ్ఞనేతితో దీపారాధన చేస్తే కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతుంది. నువ్ఞ్వల నూనెతో దీపారాధన చేస్తే కీర్తి, భగవద్భక్తి దాపంత్యసుఖం, కుటుంబ ఐక్యత పెరుగుతాయి.

kathika vanabhojanaalu

కార్తీక వనభోజనాలు ..

కార్తీకంలో వనభోజనాలు చేయడం అత్యంత పుణ్యప్రదం. ముఖ్యంగా కార్తీకమాసంలో ఏదో ఒకనాడు ఈ వనభోజనానికి వెళ్లాలి.

అయితే అందరూ కలసి ఒక తోటకు వెళ్లి అక్కడ వంట చేసుకుని సరదాగా ఆటపాటలతో గడిపి అక్కడ భోజనం చేసి రావడమే కాకుండా వనభోజన ఆచరణ విషయంలో మన శాస్త్రాకి కొన్ని నియమాలు పేర్కొన్నాయి. పలుజాతుల వృక్షాలున్న వనంలో ఉసిరిక చెట్టు కింద కూర్చుని భోజనం చేయాలని శాస్త్రవచనం.

అయితే అంతకంటే ముందుగా ఉసిరిక చెట్టునూ, ఉసిరిక చెట్టు క్రింద సాలగ్రామాన్ని ఉంచి పూజించి, నైవేద్యం చేయాలి.

తర్వాత ఆ నైవేద్యం వనానికి వచ్చిన వారంతా తోటలోనే భోజనం చేయాలి. ఈ వనభోజనాలే భిన్నత్వంలో ఏకత్వాన్ని సృజిస్తుంది. మానవ్ఞల మధ్య ఐక్యత ఏర్పడి మానవత్వం వెల్లి విరుస్తుంది.

జ్వాలాతోరణం .. సర్వపాపహరణం

కార్తీక పున్నమి రోజున దేవతలు, రాక్షసులు కలసి పాల సముద్రం చిలుకగా పుట్టిన హాలాహలం శివుడు సేవించాడు.

అప్పుడు పార్వతీదేవి ‘ ఈ హాలాహాలభక్షణం తో నా భర్తకు ఎటువంటి ఆపద కలుగకపోతే తనతో కలసి జ్వాలాతోరణం క్రింద మూడు ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుంది.

ఆ విధంగా కార్తీక పున్నమి రోజున పార్వతీ పరమశ్వరులు కలసి జ్వాలాతోరణం క్రింద ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకున్నారు.

ఆనాటి నుండి సాంప్రదాయ బద్ధంగా దేవాలయా ల్లో ఈ జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేస్తారు. భక్తులు ఆ జ్వాలాతోరణం కింద మొక్కులు తీర్చుకుని పునీతులవుతారు.

శివుడు అగ్నిస్వరూపం కాబట్టి ఇలా జ్వాలారూపంలో కాని, దీప రూపంలో కాని ఆయనను కొలవడం ఆచారంగా వచ్చింది. ఇది కాకుండా ఈ రోజు అనేక వ్రతాలు, పూజలు, నోములు ఆచరిస్తారు.

వీటితోపాటు లక్ష బిల్వార్చన, లక్ష ప్రదక్షిణ, లక్షవత్తుల్ని వెలిగించడం వంటి పూజలు చేస్తారు. ప్రతిరోజు ఆలయానికి వెళ్లకపోయినా, కార్తీక పౌర్ణమి రోజున ఆలయంలో దీపారాధన చేసి దైవదర్శనం చేసుకుంటే కోటిపుణ్యాల ఫలితాన్ని పొందుతారు.

అంతేగాక ఈ రోజున ఒక సద్బ్రాహ్మణునికి వెలిగించిన దీపాన్ని దానం చెయ్యాలి. దీంతో పాటు సాలగ్రామదానం కూడా చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారని కార్తీక పురాణం చెపుతోంది.

వెల సులభం, ఫలమధికం అయినది ఈ కార్తీక పున్నమి వ్రతం. కోరిన కోరికలు నెరవేర్చుతుంది. వేదసమ్మతమైనదీ రోజు, ఉపవాసదీక్ష పరిపూర్ణ భక్తితో ఆచరించి, శివకేశవులిరువురిని సభక్తికంగా పూజించాలి. నిష్కామంగా ఉండే భక్తులకు వారు తరిం చేలా వన్నెల వెన్నెల జల్లులతో శుభా లనూ ‘కార్తీక పౌర్ణమి వారి మీద కురిపిస్తుందని శాస్త్ర వచనం. ‘సర్వేజనాస్సుఖినోభవన్తు’

  • ఆచార్య శ్రీవత్స

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/