అర్ధరాత్రి దాటిన తేలని కర్ణాటక సంక్షోభం

తీవ్ర ఉత్కంఠ మధ్య కర్ణాటక అసెంబ్లీ మళ్లీ వాయిదా 
ఓటింగ్‌కు బిజెపి…చర్చకు అధికార పక్షం పట్టు

Karnataka Assembly
Karnataka Assembly

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వ బలపరీక్ష ఘట్టం సోమవారం అర్థరాత్రి వరకూ కూడా ఎటూ తేలకుండా సాగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బలపరీక్ష సోమవారం ముగించాలని, ఓటింగ్ నిర్వహించాలని బలమైన విపక్షం బిజెపి పట్టుపట్టింది. అయితే విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని అధికార జెడిఎస్ కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగారు. సభలో తీవ్రస్థాయిలో నినాదాలు, గందరగోళ పరిస్థితుల నడుమ స్పీకర్ ఆర్ రమేష్ కుమార్ పలు సార్లు సభను వాయిదా వేశారు. ఈ రోజే విశ్వాస పరీక్ష పూర్తి చేస్తామని, ఓటింగ్ ఉంటుందని తమకు ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారని, ఇందుకోసం తమ పార్టీ సభ్యులు అంతా అర్థరాత్రి దాటి ఒంటిగంట అయినా సభలోనే ఉంటారని బిజెపి నేత యడ్యూరప్ప తెలిపారు. దీనితో విధాన సభలో అర్థరాత్రి వరకూ ఎటూ తేలని పరిస్థితి ఏర్పడింది.

సిఎం కుమారస్వామి బలపరీక్షకు సిద్ధం కావాలని రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో స్పీకర్ సూచించారు. అయితే ఇందుకు తాము సిద్ధంగా లేమని అధికార పక్షం స్పష్టం చేసింది. బలపరీక్ష తీర్మానంపై చర్చ అసంపూర్తిగా ఉందని, ఈ దశలో ఓటింగ్ జరపడం నిబంధనలకు విరుద్ధం అని సభ్యులు వాదనకు దిగారు. దీనిని బిజెపి వారు వ్యతిరేకించారు. అయితే ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం తేలాల్సి ఉంది, విప్‌నకు సంబంధించి సుప్రీంకోర్టు రూలింగ్ వెలువరించాల్సి ఉంది. మంగళవారం కానీ సుప్రీంకోర్టు వీటిపై తేల్చే అవకాశం లేనందున బలపరీక్షను వాయిదా వేస్తేనే మంచిదని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఆయన వాదనను యడ్యూరప్ప తప్పుపట్టారు. ఎమ్మెల్యేల రాజీనామాలు, పైగా వారు సభకు హాజరు కాకుండా పోవడంతో ఇప్పుడు ప్రభుత్వానికి సంఖ్యాబలం తగ్గిందని, మెజార్టీ లేకుండా అధికారంలో ఏ విధంగా కొనసాగుతారని ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం సభలో మంత్రి కృష్ణ బైరెగౌడ ఒక్కరే దాదాపు మూడు గంటల పాటు ప్రసంగించారు. ఇంకా చర్చపై మాట్లాడే వారు 20 మంది వరకూ ఉన్నట్లు స్పీకర్ ఆ తరువాత వారి పేర్లు చదివి విన్పించారు. దీనితో బిజెపి సభ్యులు అసహనంతో రగిలిపొయ్యారు. నిరసనలకు దిగారు. బలపరీక్షకు వెంటనే ఆదేశించాలని పట్టుపట్టారు. దీనితో సభలో గందరగోళం చెలరేగింది. ఒక దశలో బలపరీక్షపై తేల్చకపోతే తానే రాజీనామా చేస్తానని స్పీకర్ హెచ్చరించారు.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/