మసీదులు, దేవాలయాలకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ

సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడే సౌండ్ ఉండాలన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు
ఆదేశాలను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

బెంగళూరు: మసీదులు, దేవాలయాలు వినియోగించే లౌడ్ స్పీకర్లపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను కఠినతరం చేశాయి. నిర్దేశిత డెసిబిల్స్ కంటే ఎక్కువ సౌండ్ రాకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు బెంగళూరు పోలీసులు 301 మసీదులు, ఆలయాలు, చర్చిలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వాటిలో 125 మసీదులు, 83 ఆలయాలు, 22 చర్చిలు, 59 పబ్బులు, రెస్టారెంట్లు ఉన్నాయి. లౌడ్ స్పీకర్ల వల్ల శబ్ద కాలుష్యం పెరిగిపోతోందని, వాటిని పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని కొందరు సామాజిక కార్యకర్తలు చేసిన విన్నపం మేరకు ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఈ సందర్భంగా బెంగళూరు సిటీ మార్కెట్ ప్రాంతంలో ఉన్న జామియా మసీదు ఇమామ్ మౌలానా మక్సూద్ ఇమ్రాన్ రషిది మాట్లాడుతూ, ‘చాలా మసీదులకు నోటీసులు అందాయి. శబ్దాన్ని నియంత్రించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ధ్వని విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని సూచించారు. ఆదేశాలను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు’ అని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తాము కచ్చితంగా పాటిస్తామని ఆయన పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎంత ధ్వని ఉండాలంటే..!

< ఇండస్ట్రియల్ ఏరియా: పగటి పూట 75 డెసిబిల్స్, రాత్రి 70 డెసిబిల్స్.
< కమర్షియల్ ఏరియా: పగటి పూట 65 డెసిబిల్స్, రాత్రి 55 డెసిబిల్స్.
< రెసిడెన్సియల్ ఏరియా: పగటి పూట 55 డెసిబిల్స్, రాత్రి 45 డెసిబిల్స్.
< సైలెన్స్ జోన్: పగటి పూట 50 డెసిబిల్స్, రాత్రి 40 డెసిబిల్స్.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/