కొత్త వేరియింట్ భయాందోళ..కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు

రెస్టారెంట్లు పబ్‌లు, థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల్లో మాస్కు తప్పనిసరి

karnataka-govt-released-corona-guidelines

బెంగళూరుః దేశంలో కరోనా కేసులు, కొత్త వేరియింట్ భయాందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కొవిడ్కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రెస్టారెంట్లు పబ్‌లు, థియేటర్లు, స్కూళ్లు, కాలేజీలు వంటి ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. అటు న్యూ ఇయర్ వేడుకలను అర్థరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే నిర్వహించుకోవాలని సూచించింది. కొవిడ్పై సమీక్ష నిర్వహించిన కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కలబురగి విమానాశ్రయంలో ప్రయాణికులకు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ఎయిర్ పోర్టు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మాస్క్ లేని వారిని ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలోకి అనుమతించబోమని కలబురగి ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ చిలక మహేష్ తెలిపారు. చైనాలో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున అంతర్జాతీయ ప్రయాణికులను పర్యవేక్షించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక రెవెన్యూశాఖ మంత్రి ఆర్ అశోక తెలిపారు. ఆరోగ్య మంత్రి కె. సుధాకర్‌తో కలిసి కొవిడ్పై సమావేశం నిర్వహించామని..ప్రయాణికులు కరోనా లక్షణాలు కలిగి ఉన్నట్లయితే..వారికి చికిత్స అందించడానికి బెంగళూరులో రెండు ఆసుపత్రులను సిద్ధం చేసినట్లు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/