కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ కి భారీ దెబ్బ..పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మృతి

కర్నాటక లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆ పార్టీకి భారీ దెబ్బ ఎదురైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధృవనారాయణ్ (61) మృతి చెందారు. గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

శనివారం ఉదయం మైసూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ నాయకులు రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా ట్విట్ట్ చేశారు. “ఎప్పటికీ నవ్వూతూ ఉంటే మా స్నేహితుడు, నాయకుడు, కాంగ్రెస్ కు అత్యంత అంకితభావంతో కూడిన సైనికుడు ఎస్ ఓచ్. ధృవనారాయణ్ కోలుకోలేని నష్టాన్ని మిగిల్చారు” అని ట్వీట్ చేశారు. అణగారిన వర్గాల కోసం. పేదల కోసం తన జీవితాన్ని ధృవనారాయణ్ అంకితం చేశారని అన్నారు. ధృవనాయణ్ మృతిచెందడంతో పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. రాత్రి వరకు ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన.. ఉదయం లేచేసరికి ఆయన లేరని కుటుంబ సభ్యులు చెప్పుకుంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ధృవ నారాయణ్ చాలా సీనియర్ రాజకీయ వేత్త. 1961 జూలై 31న చామరాజనగర్‌లోని హగ్గవాడిలో జన్మించారు. 2022 నుంచి కర్నాటక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దళిత నేతగా మంచి గుర్తింపు ఉన్న నేత నారాయణ్. 1983లో కాంగ్రెస్ లో చేరిన ఆయన.. చివరి శ్వాస వరకు ఆ పార్టీలోనే ఉన్నారు. 1999లో తొలిసారిగా సంతేమరల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సంతేమరల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యేగా నారాయణ్ చరిత్ర సృష్టించారు.