ఓటమిని అంగీకరించిన బిజెపి నేత బసవరాజ్ బొమ్మై

పూర్తి ఫలితాలు వచ్చాక అంతర్మథనం చేసుకుంటామని వెల్లడి

Karnataka CM concedes defeat in election: ‘BJP not able to make mark’

బెంగళూరుః ఎన్నికల ప్రచారంలో పార్టీ కార్యకర్తలు, నేతలు ఎంతగానో శ్రమించినా ఫలితం దక్కలేదని కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, బిజెపి నేత బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై బొమ్మై తాజాగా స్పందించారు. మెజారిటీ మార్కు చేరుకోవడంలో విఫలమయ్యామని అన్నారు. పార్టీ ఓటమిని అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి ఈ ఫలితాల్లో దూసుకుపోతున్న క్రమంలో బొమ్మై ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ వర్కర్లు, నేతలు.. అందరమూ శాయశక్తులా పార్టీని గెలిపించేందుకు కృషి చేశామని బొమ్మై చెప్పారు. అయితే, తాము అనుకున్నంతగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయామని తెలిపారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక పార్టీలో అంతర్మథనం చేసుకుంటామని వివరించారు. ఈ ఫలితాలను విశ్లేషించుకుని, ఇప్పుడు జరిగిన పొరపాట్లను దిద్దుకుంటామని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మరింత కష్టపడతామని బొమ్మై పేర్కొన్నారు.