ఎమ్మెల్యే శ్రీమంత్ బాల‌సాహెబ్ పాటిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

బీజేపీ డ‌బ్బులు ఆఫ‌ర్ చేసిందన్న‌ ఎమ్మెల్యే

బెంగ‌ళూరు : బీజేపీ ఎమ్మెల్యే శ్రీమంత్ బాల‌సాహెబ్ పాటిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను 2019లో బీజేపీలో చేరే కంటే ముందు.. ఆ పార్టీ త‌న‌కు డ‌బ్బులు ఆఫ‌ర్ చేసింద‌ని పాటిల్ నిన్న విలేక‌రుల స‌మావేశంలో పేర్కొన్నారు. బీజేపీ డ‌బ్బులు ఆఫ‌ర్ చేసిన‌ప్ప‌టికీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ఆ పార్టీలో చేరాను. త‌న‌కు డ‌బ్బులు వ‌ద్దు.. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు మంత్రి ప‌ద‌వి కావాల‌ని అడిగాను.

ఆ మేర‌కు బీఎస్ యెడియూర‌ప్ప సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌రించింది. కానీ బ‌స‌వ‌రాజ్ బొమ్మై సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం త‌న మంత్రి ప‌ద‌వి ఊడింది. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఎందుకు రాలేదో తెలియ‌డం లేద‌న్నారు. అయితే త్వ‌ర‌లో జ‌రిగే కేబినెట్ విస్త‌ర‌ణ‌లో త‌న‌కు త‌ప్ప‌కుండా మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని బ‌స‌వ‌రాజ్ బొమ్మై హామీ ఇచ్చార‌ని ఎమ్మెల్యే పాటిల్ పేర్కొన్నారు.

కాగా, క‌గ్వాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పాటిల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019, జులైలో జేడీఎస్ – కాంగ్రెస్ మ‌ద్ద‌తుదారులైన 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేర‌డంతో సంకీర్ణ ప్ర‌భుత్వం ప‌త‌నానికి దారి తీసింది. ఆ 16 మంది ఎమ్మెల్యేల్లో పాటిల్ కూడా ఒక‌రు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/