కర్మఫలం

ఒకనాడు పరీక్షిన్మహారాజు వేటకు వెళ్లాడు. వేటాడి వేటాడి అలసిపోయాడు. ఆకలిగొన్నాడు. దప్పికయింది. ఒక ముని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడున్న శమీక మహర్షి ధ్యానంలో ఉన్నాడు. రాజుకు అన్న పానాలు ఇవ్వలేదు. కనీసం ఎదురొచ్చి స్వాగతం పలకలేదు. రాజుకు కోపమొచ్చి పక్కనే చచ్చి పడిఉన్న ఒక పామును ఆయన మెడలో వేసి వెళ్లిపోయాడు. శమీక మహర్షి కుమారుడైన శృంగికి విషయం తెలిసింది. ‘రాజు, హరకేశవులొడ్డిననైన జచ్చు పో యేడవనాడు తక్షణ ఫణీంద్ర విషానల హేతి సంహతిన్‌, అని శాపమిచ్చాడు. రాజు తన రాజధానికి చేరిన తరువాత తాను అవివేకముతో చేసిన పనిని గూర్చి చింతిస్తూ ఉంటే శమీక మహర్షిచే పంపబడిన ఒక మునికుమారుడు వచ్చి శృంగి పెట్టిన శాపాన్ని గూర్చి చెప్పాడు.

పరీక్షిన్మహారాజు స్పందన ఎలాగుందో చూడండి. ‘సంసారాసక్తుడై ఉన్న నాకు వైరాగ్యమును బోధించుటకే భగవంతుడు ఈ ఏర్పాటు చేసినాడని భావించెదను. తక్షకుని వలన మరణమును సంతోషముతో ఆహ్వానిస్తాను అని అన్నాడు. మనము భాగవత ప్రవచనాలను బాగా వింటాం. తలలూపి చప్పట్లు చరుస్తాం. చాగంటి వారు బాగా వివరించారు. గరికపాటి వారు బలే బాగా విశ్లేషించారని అంటాం వారు మనకు దొరికితే వారికి శాలువాలు కప్పుతాం. ఇంకా వీలైతే వాళ్ల కాళ్లకు మొక్కుతాం. అంతేగాని బోధను ఒంటబట్టించుకుని జీవించటానికి మ్తారం అసలు ప్రయత్నించం. పాముకాటుతో ఏడు రోజుల్లో ఛస్తావని శపించాడని వార్తను విన్న పరీక్షిన్మహారాజు స్పందన చూడండి. ఎవరైనా మనల్ని కొంచెం విమర్శిస్తేనే కళ్లు ఎర్రచేసి ‘ నీ అంతు చూస్తా అంటాం.

మన తప్పులను మనం ఎలాగూ కనుగొనలేం, ఇక విమర్శించే వారే లేకపోతే మనం బాగుపడేదెట్లా? గాంధీ అంటారు ‘నన్ను పొగిడే మిత్రుల నుంచి కంటే కూడా నన్ను విమర్శించే మిత్రుల నుంచే నేను ఎక్కువ లాభపడ్డా అని. మనమేమో మనల్ని పొగిడే వారిని మిత్రులని, నిందించేవారిని శత్రువులని అంటాము. మరి గాంధీజీ విమర్శించే వాళ్లను కూడా ‘మిత్రులు అనే అన్నారు. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. తప్పులు చేయడం చాలా సహజం. మనమే ఆలోచించి, తెలుసుకుని పశ్చాత్తాపపడాలి, క్షమాపణ కోరాలి. ఫలితాన్ని అనుభవించటానికి సిద్ధం కావాలి. లేదా ఇతరులు మన తప్పులను ఎత్తి చూపితే వారికి కృతజ్ఞతలు తెలపాలి. కర్మ ఫలాన్ని అనుభవించటానికి ఆనందంగా సిద్ధపడ్డాలి. పరీక్షిన్మహారాజు చేసింది అదే. నేర్చుకునే దానికి సిద్ధపడితే ఏ చిన్న సంఘటన అయినా మనకు ఎంతో నేర్పుతుంది, మన జీవితాలను మార్చి వేస్తుంది.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/