కంటి వెలుగు పథకం : ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు రిలీజ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కంటి వెలుగు పధకం మళ్లీ ప్రారంభం కాబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 తేదీ నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం మొదలుకాబోతుంది. ఈ నేపథ్యంలో పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలను విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. డిసెంబర్ 1 వ తేదీన నోటిఫికేషన్, 5 వ తేదీన ఇంటర్ వ్యూ, 10 వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నారు. కంటి వెలుగు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1491 వైద్య బృందాలను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.

మరోపక్క రెండో విడుత కంటి వెలుగు కార్య‌క్ర‌మానికి రూ. 200 కోట్ల నిధులను విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. ఈ మేర‌కు నిధుల విడుద‌ల‌పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అందరు కలిసి ఉత్సాహంగా పని చేసి కంటి వెలుగు-2ని విజయవంతం చేయాల‌ని వైద్యారోగ్య శాఖ‌ మంత్రి హరీశ్‌రావు కోరారు.

ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓలు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, క్వాలిటీ టీమ్స్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్లకు ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, మొద‌టి విడుత‌లో భాగంగా 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వ‌హించి, 50 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేసిన‌ట్లు పేర్కొన్నారు. రెండో విడుత‌లో భాగంగా కోటిన్న‌ర మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, 55 ల‌క్ష‌ల మందికి క‌ళ్ల‌ద్దాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు హ‌రీశ్‌రావు తెలిపారు. ఇందులో 30 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసెస్‌, 25 లక్షల మందికి ప్రిస్క్రిషన్ గ్లాసెస్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.