శ్రీవారి ఆస్తుల పరిరక్షణపై కన్నా ఉపవాసదీక్ష

హిందూ దేవాలయాల జోలికి రావద్దని తాము రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సార్లు చెప్పాం.. కన్నా లక్ష్మీ నారాయణ

kanna lakshmi narayana
kanna lakshmi narayana

గుంటూరు: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆపార్టీ నేతలతో కలిసి ఈరోజు గుంటురులో ఉపవాస దీక్షకు దిగారు. తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణపై ఏపి ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆయన ఈ దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా కన్నా లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడారు. హిందూ దేవాలయాల జోలికి రావద్దని తాము రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సార్లు చెప్పామని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. అయితే, తాము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ప్రభుత్వం వినిపించుకోకుండా ఆలయాల భూములపై ముందుకు వెళ్తోందని ఆయన విమర్శించారు. మంగళగిరి, అన్నవరంలో ఆలయ భూములు తీసుకునే ప్రయత్నాలు చేశారని వివరించారు. తాము చేస్తోన్న ఆందోళనల వల్లే ఇప్పటికే మంగళగిరి, అన్నవరం భూముల విషయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆయన చెప్పారు.

ఇప్పుడు టీటీడీ భూములకే ఎసరు పెట్టారని ఆయన విమర్శించారు. ధార్మిక సంస్థలన్నీ ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాయని ఆయన తెలిపారు. టీటీడీ చైర్మన్‌ మాత్రం భూముల అమ్మకానికి కేవలం రోడ్‌ మ్యాప్‌ ఇచ్చామంటూ వ్యాఖ్యలు చేశారన్నారు. ఆలయాల ఆస్తుల పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ కోసమే తాము ఉపవాస దీక్షలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


తాజా కరోనా లాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/