వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్ష‌లు స‌రికాదు

ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌క‌పోయినప్ప‌టికీ పండుగ‌ను జ‌రుపుకుని తీరుతాం: బీజేపీ నేత క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌

అమరావతి : వైస్సార్సీపీ ప్రభుత్వం ఏపీ లో వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించడం ప‌ట్ల బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఈ రోజు ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను బీజేపీ నేత క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌, విశ్వ హిందూ ప‌రిష‌త్ నేత‌లు క‌లిసి ప్ర‌భుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు. అనంత‌రం క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో హిందూ మ‌తంపై దాడులు జ‌రుగుతున్నాయ‌ని, ఇటువంటి ఘ‌ట‌న‌లు రాష్ట్రంలో 150కిపైగా జ‌రిగినా అరెస్టులు చేయ‌ట్లేద‌ని ఆయ‌న‌‌ ఆరోపించారు.

ఇప్పుడు హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వినాయ‌క చ‌వితిని ఇళ్ల‌లోనే జ‌రుపుకోవాల‌ని ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోలను ఖండిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో సినిమా థియేట‌ర్లు, పాఠ‌శాల‌లు, బార్ల‌కు లేని నిబంధ‌న‌లు చ‌వితి ఉత్స‌వాల‌కు ఎందుకు విధించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ విష‌యంపై గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల‌ని తాము కోరిన‌ట్లు తెలిపారు. ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌క‌పోయినప్ప‌టికీ పండుగ‌ను జ‌రుపుకుని తీరుతామని స్ప‌ష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/