రైతుల ఉద్యమానికి థన్‌బర్గ్‌, రిహనా మద్దతు!

సినీ‌ నటి కంగన రనౌత్ ఆగ్ర‌హం

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన కొత్త‌ వ్యవసాయ చట్టాలను ర‌ద్దు చేయాల్సిందేనంటూ ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే ప‌లు దేశాలు కూడా స్పందించాయి. తాజాగా, ప్రముఖ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థ‌న్‌బ‌ర్గ్, హాలీవుడ్‌ పాప్‌ స్టార్‌ రిహన్నా కూడా భార‌త రైతుల ఉద్య‌మం గురించి స్పందించ‌డం గ‌మ‌నార్హం.

ఉద్య‌మం చేస్తోన్న‌ భారత్‌లోని రైతులకు సంఘీభావం తెలుపుతున్నామంటూ గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్ చేశారు. ఓ వార్తా ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని ఈ సంద‌ర్భంగా ఆమె పోస్ట్ చేశారు. ఢిల్లీలో రైతుల ఉద్య‌మాన్ని అణ‌చివేసేలా పలు ప్రాంతాల్లో విధించిన ఆంక్షల వంటి అంశాలను ఆ వార్త‌లో ప్ర‌చురించారు.

రైతుల ఉద్య‌మం గురించి పాప్‌ సింగర్‌ రిహన్నా స్పందిస్తూ… మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు? అని ప్ర‌శ్నించారు. ఆమె కూడా ఓ వెబ్ ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను పోస్ట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్ ట్విటర్‌లో చాలాసేపు ట్రెండ్ అయింది. అలాగే, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మేనకోడలు మీనా హారిస్‌ కూడా రైతులకు మద్దతు తెలుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కాగా, రిహన్నా చేసిన‌ ట్వీట్‌పై సినీ‌ నటి కంగన రనౌత్ స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న వారు రైతులు కాదని, వారు దేశాన్ని విభజించాలనుకుంటున్న ఉగ్రవాదులని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వారంతా భార‌త్‌ను ముక్కలుముక్కలుగా చేసి చైనా కాలనీగా మార్చాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తాము దేశాన్ని అమ్మాలనుకోవడం లేదని కంగ‌న చెప్పారు. అందుకే దీనిపై ఇక్క‌డ‌ ఎవరూ మాట్లాడటం లేదని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/