కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా

ట్విటర్ ద్వారా ప్రకటించిన ఎంపీ కేశినేని నాని

Kanaka-Durga-Flyover

విజయవాడ: కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం మరోసారి వాయిదాపడింది. రేపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కనక దుర్గ ఫ్లైవర్‌ని ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆయనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఐతే ప్రారంభోత్సవం వాయిదా పడినప్పటికీ రేపటి నుంచే కనక దుర్గ ఫ్లైఓవర్ నుంచి వాహనాలను రాకపోకలకు అనుమతించనున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.

కాగా సెప్టెంబరు 4నే దుర్గగుడి ఫ్లెఓవర్‌ను ప్రారంభించాలని గతంలో అధికారులు నిర్ణయించారు. ఐతే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు సంతాప దినాలు ఉన్నందున ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. అనంతరం సెప్టెంబరు 18న ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పుడు నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో.. మళ్లీ వాయిదా పడింది.

కొన్ని దశాబ్దాలపాటు విజయవాడ నగరవాసులు దుర్గ గుడి దగ్గర ట్రాఫిక్ ఇక్కట్లు పడ్డారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పూర్తి కావడంతో ఎట్టకేలకు విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలో 50 శాతం ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/