శాయ్ లో శిక్షణకు సిద్ధమైన కంబళ వీరుడు

Kambala Jockey Srinivasa Gowda
Kambala Jockey Srinivasa Gowda

బెంగళూరు: భారతీయ ఉసేన్‌ బోల్ట్‌ అనిపించుకుంటున్న కంబళ వీరుడు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీనివాసగౌడ అసలైన పరుగుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ‘శాయ్’ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)లో శిక్షణ పొందేందుకు శ్రీనివాసగౌడతో ఒప్పందం కుదిరింది. కేరళలోని కాసర్‌గోడ్‌లో నిర్వహిస్తున్న అన్న-తంబ కంబళ పోటీల్లో శ్రీనివాసగౌడ్‌ ఇటీవల వందమీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలోనే పూర్తి చేయడం, అది కూడా బురదలో అత్యంత వేగంగా పరిగెత్తడం దేశం మొత్తాన్ని ఆకర్షించిన విషయం తెలిసిందే. దీంతో అతనికి సరైన శిక్షణ అందజేసి భారత్‌ తరపున పరుగు పందాలకు పంపాలంటూ నెటిజన్ల నుంచి ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శాయ్ దక్షిణ భారత సంచాలకుడు అజయ్‌కుమార్‌ బల్‌ కాసరగూడ వెళ్లి అమ్మ తంబ పోటీలను వీక్షించారు. అనంతరం కంబళ అకాడమీ సమన్వయకర్త గుణపాల్‌ కదంబతో శ్రీనివాసగౌడకు శిక్షణ అందించే అంశంపై చర్చించారు. శ్రీనివాసగౌడ కూడా శిక్షణకు సై అనడంతో బెంగళూరు కేంద్రంలో ఆయనకు శిక్షణ అందజేయాలని నిర్ణయించారు. ఈనెల చివరి వరకు కంబళ పోటీలు జరుగుతాయి. ఈ పోటీలు ముగిసిన తర్వాత శ్రీనివాసగౌడ శాయ్ శిక్షణకు హాజరవుతారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/