కమలా హారిస్‌కు తప్పిన ప్రమాదం

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానం గాల్లో ఉండగానే… సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన 25 నిమిషాలకే విమానం.. వెనక్కి తిరిగొచ్చి అత్యవసరంగా ల్యాండ్ అయింది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా కమలా హారిస్.. ఆదివారం విదేశీ పర్యటకు పయనమయ్యారు. మేరీల్యాండ్ నుంచి గ్వాటెమాల‌కు ఎయిర్‌ఫోర్స్-2 విమానం బయల్దేరారు. ఈ క్రమంలో టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే.. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీన్ని గుర్తించిన ఫైలెట్లు.. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పారు. తిరిగి మేరీల్యాండ్‌లో ల్యాండ్ చేశారు.


కాగా.. తాము సురక్షితంగానే ఉన్నట్టు కమలా హారిస్ ప్రకటించారు. విమానం నుంచి కిందకు దిగుతూ.. ‘సురక్షితంగా ల్యాండ్ కావాలని మేము ప్రార్థించాము. కానీ మేమంతా క్షేమంగానే ఉన్నాం’ అని అక్కడున్న రిపోర్టర్లకు తెలిపారు. ఆ వెంట‌నే ఆమె మ‌రో విమానంలో గ్వాటెమాలాకు వెళ్లారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/