ఆలయం ఆకారంలో ఉన్న కేక్‌ కట్‌ చేసిన కమల్‌ నాథ్‌..బిజెపి నేతల ఆగ్రహం

కమల్ నాథ్‌పై తీవ్ర విమర్శలు చేసిన మధ్యప్రదేశ్ సీఎం

kamal-nath-cuts-temple-shaped-birthday-cake-bjp-fires

భోపాల్ః మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత కమల్‌ నాథ్‌ గురువారం 76వ పుట్టిన రోజు జరపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు చింద్వారాలోని కమల్‌నాథ్‌ ఇంటి వద్ద ముందస్తు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని పోలిన ఓ కేక్‌ను కమల్‌నాథ్‌తో కట్‌ చేయించారు. దీంతో బిజెపి నేతలు కమల్‌నాథ్‌పై విరుచుకుపడుతున్నారు. ఇది హిందువులను అవమానించడం తప్ప మరోటి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కమల్‌నాథ్ కట్ చేసిన కేకు ఆలయం ఆకారంలో ఉండడంతోపాటు పైన హనుమంతుడి బొమ్మ, కాషాయ జెండా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కమల్‌నాథ్ తన సొంత పట్టణమైన చింద్వారాలో మూడు రోజుల పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. మద్దతుదారులు కమల్‌నాథ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన ఇంటి వద్ద వేడుకలు నిర్వహించారు.

వైరల్ అయిన వీడియోపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. మతపరమైన చిహ్నాలతో కూడిన కేక్‌ను కట్ చేయడం ద్వారా కమల్‌నాథ్ వారి మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ నాథ్, ఆయన పార్టీ వారు నిజమైన భక్తులు కాదని, వారికి దేవుడితో ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు. ఒకప్పుడు రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన పార్టీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారని విమర్శించారు. అయితే, అది ఎన్నికల్లో తమకు ప్రతికూలంగా మారుతుందని గ్రహించి హనుమంతుడి భక్తుడిగా మారిపోయారని ఎద్దేవా చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/