దేశ రాజకీయాలలో చరిత్ర సృష్టించబోతున్నాం

Kadiyam Srihari
Kadiyam Srihari

దేశ రాజకీయాలలో చరిత్ర సృష్టించబోతున్నాం

డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి

హైదరాబాద్‌: ప్రగతి నివేదన సభతో దేశ రాజకీయాలలో చరిత్ర సృష్టించబోతున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు కొత్త సంక్షేమ పథకాలను కూడా అమలు చేసినట్లు చెప్పారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో రైతును రాజును చేయడమే లక్ష్యంగా రుణాల రద్దు, రైతు బంధు పథకంతో రూ. 4 వేల పంట పెట్టుబడి సాయం, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో అతి కొద్ది సమయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయగలిగామంటే అది కేసీఆర్‌ పాలనా దక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ రైతన్న గోడు తెలిసిన వ్యక్తి అయిన కారణంగానే కేసీఆర్‌ మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కంటి వెలుగు కార్యక్రమాలను అమలు చేస్తున్నామనీ, దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు తెలంగాణకు వచ్చి వీటిని అధ్యయనం చేస్తున్నారంటే ఇవి ఏ మేరకు విజయవంతం అయ్యాయో అర్థం చేసుకోవచ్చన్నారు.

మైనార్టీలకు రూ. 2000 కోట్లు కేసీఆర్‌ ఘనతే : మహమూద్‌ అలీ
దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో మంజూరు చేయని విధంగా మైనార్టీల సంక్షేమానికి రూ. 2000 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ అన్నారు. గంగా-జమునా తెహజీబ్‌ సంస్కృతి ఉన్న తెలంగాణలో మైనార్టీలకు అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు : కేకే
ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులనీ, తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారికి తెలియజెప్పడానికే ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కే.కేశవరావు అన్నారు. ఇప్పటి వరకు అమలు చేసిన, భవిష్యత్తులో అమలు చేయనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే ఈ సభ లక్ష్యమన్నారు. తెలంగాణ ఏర్పడి కేవలం నాలుగేళ్లే అయిందనీ, మొదటి రెండేళ్లు ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడ ఉందో, ఏ అధికారి ఎక్కడ ఉంటాడో తెలియదనీ, అయినప్పటికీ గత రెండేళ్లలోనే లెక్కకు మించిన పథకాలు అమలు చేయడం జరిగిం దన్నారు. కేవలం 2 ఏళ్లలోనే 500 సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయడం మామూలు విషయం కాదన్నారు. ఈ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రగతి నివేదన సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారంటే ప్రభుత్వంపై వారికి ఉన్న నమ్మకమే కారణమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని 31 జిల్లాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.