కడెం ప్రాజెక్టుకు పెను ముప్పు తప్పింది

కడెం ప్రాజెక్టుకు పెను ముప్పు తప్పింది..ఎగువ నుండి వస్తున్న భారీ వరదతో ప్రాజెక్టుకు ప్రమాదమేమైనా జరుగుతుందా అని అధికారులు , ప్రభుత్వం భయపడింది. కానీ వరద ఉదృతి తగ్గడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. భారీ వరదల నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రాజెక్టు వద్ద ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, ప్రాజెక్టును కాపాడేందుకు మానవ ప్రయత్నాలు అన్ని చేశామని అన్నారు. ఎట్టకేలకు వర్షాలు తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తంలో వరద దిగువకు వదులుతున్నారు. మొత్తం 17 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు.

మరోపక్క వరుణుడు, గోదారమ్మ శాంతించు అంటూ మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి నది మహోగ్రరూపానికి కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వేలాది మంది నిరాశ్రులయ్యారు. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలో వరద తీవ్రత అధికంగా ఉంది. పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. చుట్టూ నీళ్లతో గ్రామాలు ద్వీపాలను తలపిస్తున్నాయి. ఏమవుతోందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోపక్క సీఎం కేసీఆర్ సైతము ముంపు గ్రామాలు, ప్రాంతాల్లోని జనాన్ని రక్షించేలా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నారు. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అలర్ట్ గా ఉండాలన్నారు.