కాకినాడ మత్స్యకారుల వలకు చిక్కిన కచ్చిడి చేప..వేలం వేస్తే రూ.2.50లక్షలు పలికింది

అప్పుడప్పుడు సముద్ర చేపల వేటకు వెళ్ళినప్పుడు మత్స్యకారుల వలకు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. తాజాగా కాకినాడకు చెందిన మత్స్యకారులకు అలాంటి అరుదైన చేప చిక్కింది. వారి వలకు అరుదైన కచ్చిడి చేప దొరికింది. ఈ చేప ను వేలం వేయగా రూ.2.50 లక్షలకు రత్నం అనే వ్యాపారి కొనుగోలు చేశారు. అరుదుగా చిక్కే ఈ చేపలను కోల్‌కతా, ఒడిశాకు ఎగుమతి చేస్తామని వ్యాపారి చెప్పుకొచ్చారు. ఈ చేప బ్లాడర్‌ను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని.. అందుకే అంత గిరాకీ ఉంటుందని కాకినాడ మత్స్యశాఖ జేడీ చెప్పారు. ఈ చేపకు భారీ ధర పలకడంతో మత్స్యకారులు సంబరాలు చేసుకుంటున్నారు.

సాధారణంగా కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తారు. నిజంగానే ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు బంగారం దొరికనట్టే భావిస్తారు. తమకు సిరులు కురిపిస్తుందని చెబుతుంటారు.ఈ చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి మరో చోటికి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ కచిడి చేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారట. ఇక కాస్లీ వైన్స్‌లో కూడా ఈ చేపను వేయడంతో ఆ వైన్‌ ధర కూడా ధర ఎక్కువగా పలుకుతుందని ఈ చేప గురించి పూర్తిగా తెలిసిన వారు చెబుతున్నారు. కచిడి చేపల పొట్టభాగం ఒక్కటే రూ.80వేల వరకు ధర పలుకుతుందట. పొట్టభాగాన్ని బలానికి వాడే మందుల్లో వినియోగిస్తారట.