బొగ్గుట్టలో కబడ్డీ పోటీల క్రీడోత్సవం

ఇల్లెందు/ఇల్లెందు టౌన్‌: ఇల్లెందు లాంటి మారుమూల మన్యం ప్రాంతం కేవలం బొగ్గు ఉత్పత్తికే పెట్టింది పేరుగా కాకుండా క్రీడలకు, కళలకు నెలవుగాకూడా ఉంటుందనేలా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను అట్టహాసంగా నిర్వహించడంతో రుజువైందని ఇల్లెందు ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ నాయక్‌, తెలంగాణ కబడ్డీ అసోసియోషన్‌ జిల్లా ఛైర్మెన్‌ బానోత్‌ హరిసింగ్‌, పురపాలక ఛైర్మెన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వర్‌రావు, ఏరియా జీఎం సత్యనారా యణ అన్నారు. సోమవారం రాత్రి స్థానిక సింగరేణి పాఠశాల క్రీడామైదానం లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను వారు ప్రారంభించారు. ముందుగా రాష్ట్ర, జిల్లా జెండాలను వారు ఆవిష్కరించారు. అనంత రం వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభలో వక్తలు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో జిల్లా కేంద్రాల్లో పేరుగాంచిన నగరాల్లో నిర్వహించే పోటీలను మన్యం ప్రాంతమైన ఇల్లెందులో నిర్వహించడం అది ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షించే విధంగా ఇల్లెందులో నిర్వహిస్తున్న ఈ క్రీడాపోటీలతో ఇల్లెందు ప్రాంతం క్రీడలకు నెలవుగా మారనుందని అన్నారు. సుమారు 12 వందల మంది క్రీడాకారులతో 4 రోజుల పాటు జరగనున్న కబడ్డీ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగనున్నాయని తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి జాతీయస్థాయి జట్టులో అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు

. గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందనేది ఈ 67వ సీనియర్‌ కబడ్డీ పోటీలు నిదర్శనమన్నారు. అతితక్కువ సమయంలో దేదీప్యమానంగా ఈ క్రీడాపోటీలను నిర్వహించడం ఎంతో గర్వకారణమని ఇల్లెందులో భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఆతిథ్యమిచ్చే అవకాశం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు క్రమశిక్షణను అందిస్తాయని అన్నారు. గెలుపోటములను ఒకే విధంగా స్వీకరించినప్పుడు క్రీడాకారుడిగా గుర్తించబడతారని అన్నారు. క్రీడాస్పూర్తితో ప్రతి క్రీడాకారుడు మైదానంలో నిలబడినప్పుడే విజయం దాసోహమవుతుందని పేర్కొన్నారు.

ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్న కబడ్డీ పోటీలను ప్రజలందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా నిర్వహించన సాంస్కృతిక కార్యక్రమాలను క్రీడాకారులను, క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతర స్థానిక మైనార్టీ గురుకుల విద్యార్ధుల విన్యాసాలు చూపరులను ఎంతగానో మంత్రముగ్దులను చేశాయి.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షులు క్రిష్టోఫర్‌, జిల్లా కన్వీనర్‌ స్వాతిముత్యం, జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్‌ దిండిగాల రాజేందర్‌, పులిగండ్ల మాధవరావు, వైస్‌ఛైర్మెన్‌ జాని, జడ్పీటీసీ ఉమాదేవి, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, వైస్‌ఎంపీపీ ప్రమోద్‌, వివిధ మండలాల అధ్యక్షులు, పీఏసీఎస్‌ ఛైర్మెన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, ఇల్లెందు తహసిల్తార్‌ మస్తాన్‌రావు, నాయకులు ఎస్‌.రంగనాథ్‌, యలమద్ది రవి, ఖమ్మంపాటి రేణుక, బబ్లూ, పర్చూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/