సిఎం జగన్‌ కేసు..తప్పుకున్న జస్టిస్‌ లలిత్‌ కుమార్‌

వాది, ప్రతివాదుల్లో ఒకరి తరఫున గతంలో వాదించానన్న లలిత్ కుమార్

Justice Lalit recuses from hearing plea seeking removal of AP CM Jagan Reddy

న్యూఢిల్లీ: ఏపి సిఎం జగన్‌పై వేసిన పిటిషన్‌ ఈరోజు సుప్రీంకోర్టు స్వీకరించింది. సిఎం ప‌ద‌వి నుంచి జగన్‌ను తొల‌గించాలంటూ న్యాయ‌వాదులు పిటిష‌న్ వేశారు. సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ‌పై సిఎం జగన్‌ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు న్యాయ‌వాదులు త‌మ ఫిర్యాదులో ఆరోపించారు. అయితే ఈ కేసు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఇవాళ జ‌స్టిస్ యూ.యూ. ల‌లిత్ తెలిపారు. గ‌తంలో ఏపి సిఎం జగన్‌ కేసుల‌ను కొన్ని వాదించాన‌ని, దాని మూలంగానే ఈ కేసు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు జ‌స్టిస్ ల‌లిత్ వెల్ల‌డించారు. జ‌స్టిస్ ల‌లిత్‌తో పాటు జ‌స్టిస్ వినీత్ శ‌ర‌న్‌, ర‌వీంద్ర భ‌ట్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం వైఎస్ జ‌గ‌న్ కేసును విచారించాల్సి ఉన్న‌ది. కానీ ల‌లిత్ త‌ప్పుకోవ‌డంతో.. ఇప్పుడు ఈ కేసును మ‌రో బెంచ్‌కు రిఫ‌ర్ చేయాల్సి ఉంటుంది. సిఎం జ‌గ‌న్‌పై పిటిష‌న్ వేసిన వారిలో న్యాయ‌వాదులు జీఎస్ మ‌ణి, ప్ర‌దీప్ కుమార్ యాద‌వ్‌, సునిల్ కుమార్ సింగ్‌తో పాటు ఎన్జీవో యాంటీ క‌ర‌ప్ష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్ర‌స్టు కూడా ఉన్న‌ది. జ‌స్టిస్ ర‌మ‌ణ‌పై జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని, అవి నిరాధార‌మైన‌వ‌ని, వైఎస్ జ‌గ‌న్‌పై 20 క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు ఆ న్యాయ‌వాదుల బృందం సుప్రీంలో కేసు దాఖ‌లు చేసింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/