సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తి గా చంద్రచూడ్ ప్రమాణం

Justice D Y Chandrachud takes oath as 50th Chief Justice of India

న్యూఢిల్లీః భారత సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కాగా, 44 ఏళ్ల క్రితం చంద్రచూడ్ తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేయగా.. ఇప్పుడు ఆయన తనయుడు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. నేటి నుంచి 2024 నవంబర్ 10వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్‌ వైవి చంద్రచూడ్‌ ఫిబ్రవరి 22, 1978 నుంచి జూలై 11, 1985 వరకు సీజేఐగా తన సేవలను అందించారు.

చారిత్రాత్మక తీర్పులు వెలువరించిన అనేక రాజ్యాంగ ధర్మాసనాలు, సుప్రీంకోర్టు బెంచ్‌లలో జస్టిస్ చంద్రచూడ్ భాగమయ్యారు. అయోధ్య భూవివాదం, IPC సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్క సంబంధాలను నేరరహితం, ఆధార్ పథకం చెల్లుబాటుకు సంబంధించిన విషయాలు, శబరిమల సమస్య, సైన్యంలోని మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు, భారత నౌకాదళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ వంటి నిర్ణయాలు.

జస్టిస్ చంద్రచూడ్ 29 మార్చి 2000 నుంచి 31 అక్టోబర్ 2013 వరకు బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ చంద్రచూడ్ జూన్ 1998లో బాంబే హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. అదే సంవత్సరంలో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/