బిఆర్ఎస్ కీలక నిర్ణయం..పొంగులేటి, జూపల్లి కృష్ణారావు లను పార్టీ నుండి సస్పెండ్ చేసిన అధిష్టానం

బిఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్దీ నెలలుగా బిఆర్ఎస్ సర్కార్ ఫై , కేసీఆర్ ఫై ఆరోపణలు చేస్తూ వస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు జూపల్లి కృష్ణారావు లను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు జూపల్లి కృష్ణారావు. ఇదే వేదికపై సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు ఇద్దరు నేతలు.

ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని.. కానీ అది సాధ్యం కాదనిపొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కుటుంబ స్వార్థానికి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్‌ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నారని.. అది పగటి కలేనంటూ విమర్శించారు. ఎందరో అమరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్‌ తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలో పాలన ఎప్పుడో గాడి తప్పిందని.. BRS పేరుతో చెత్త పాలనను దేశానికి ఇవ్వాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. వీరి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న గులాబీ బాస్..వెంటనే వీరిపై వేటు వేశారు. పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసారు.