అసంపూర్తిగా చర్చలు.. జూడాల సమ్మె కొనసాగింపు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయని జూనియర్ డాక్టర్లు తెలిపారు. త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాలంటూ జూనియ‌ర్ డాక్ట‌ర్లు రాష్ట్ర వ్యాప్తంగా స‌మ్మె బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌తో జూనియ‌ర్ డాక్ట‌ర్లు చ‌ర్చ‌లు నిర్వ‌హించారు. అయితే, ఈ చ‌ర్చ‌లు అంస‌పూర్తిగా ముగిశాయ‌ని జూడాలు పేర్కొన్నారు. కొన్ని ప్ర‌తిపాద‌న‌ల‌పై మంత్రి సానుకూలంగా స్పందించార‌ని, మ‌రికొన్ని ప్ర‌తిపాద‌న‌ల‌పై మ‌రోసారి చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.

డాక్ట‌ర్ల భ‌ద్ర‌త గురించి ఆలోచిస్తామ‌ని, స్టైఫండ్‌కు గ్రీన్ ఛాన‌ల్‌పై మ‌రోసారి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి చెప్పిన‌ట్లు జూనియ‌ర్ డాక్ట‌ర్లు పేర్కొన్నారు. స‌మ్మె కొన‌సాగింపుపై రాష్ట్ర స్థాయి జూడాల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. అప్ప‌టి వ‌ర‌కు స‌మ్మె య‌థాత‌థంగా కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.