జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ గ్యాంగ్‌ రేప్ కేసుకు సంబంధించి కీలక తీర్పు

జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ గ్యాంగ్‌ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురు రాజకీయ నేతల కుమారులు ఉన్నట్లు వార్తలు వెలువడడం తో డే వన్ నుండి కూడా అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ గ్యాంగ్ రేప్ కేసులో శుక్రవారం ఓ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. మైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డ ఐదుగురు మైన‌ర్ నిందితుల్లో న‌లుగురిని మేజ‌ర్లుగా ప‌రిగ‌ణిస్తూ జువెనైల్ జ‌స్టిస్ బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది. ఐదో నిందితుడైన ఎమ్మెల్యే కొడుకును మాత్రం మైనర్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. మేజర్లుగా పరిగణించిన నలుగురిని సాధారణ నిందితుల్లాగే విచారించవచ్చని తేల్చి చెప్పింది. జువైనల్‌ సెక్షన్‌ 15 ప్రకారం.. నలుగురు మేజర్లుగా బోర్టు అంచనాకు వచ్చింది. నలుగురు నిందితులు తీవ్ర నేరానికి పాల్పడ్డారని న్యాయస్థానం భావించింది. మానసిక నిపుణులతో పాటు బోర్డు సభ్యుల నివేదికను ట్రయల్‌ కోర్టు సమీక్షించింది.

ఈ ఏడాది మే 28న జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ వద్ద బాలికను కారులో ఎక్కించుకున్న ఆరుగురు నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. కారులో నగరమంతా తిరుగుతూ దారుణానికి పాల్పడ్డారు. వారిలో ఒకరు ఎమ్మెల్యే కొడుకు కావడంతో ఈ ఘటన పెను దుమారం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేయగా.. ఐదుగురు మైనర్లు కావడంతో జువైనల్ హోంకు, ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను జైలుకు పంపారు. జులైలో జువైనల్ జస్టిస్ బోర్డు నలుగురు మైనర్లకు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్యే కొడుకు హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టులో ప్రధాన నిందితుడైన సాదుద్దీన్ కు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.